: జగన్ తీరు నన్ను ఎంతో బాధించింది: అఖిలప్రియ
మానసిక వేదనతోనే తన తండ్రి నాగిరెడ్డి చనిపోయారంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. తన తండ్రి ఏనాడూ పదవి కోసం ఆలోచించలేదని చెప్పారు. మంత్రి పదవి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఏనాడు అడగలేదని తెలిపారు. కేవలం నంద్యాలలో పేదలకు పది వేల ఇళ్లు, రోడ్ల విస్తరణ గురించి మాత్రమే ముఖ్యమంత్రితో మాట్లాడారని చెప్పారు. అసెంబ్లీలో తన తండ్రి సంతాప తీర్మానాన్ని వైసీపీ అధినేత జగన్ బాయ్ కాట్ చేయడం బాధను కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన కుటుంబానికి తన తల్లి శోభా నాగిరెడ్డి ఎంతో చేశారని... ఆ విషయాలన్నింటినీ జగన్ మరిచిపోయారని విమర్శించారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని... తన తల్లిదండ్రుల లక్ష్యాలను సాధించడమే తనకు ముఖ్యమని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలో ఎవరు బరిలోకి దిగుతారనే విషయాన్ని త్వరలోనే చెబుతానని తెలిపారు.