: టాయిలెట్లలో మనవాళ్లు చేసే పనులతో విమానాలు ఆలస్యం!
భారతీయ ప్రయాణికులు విమాన ప్రయాణంలో భాగంగా టాయిలెట్లలో చేసే పనుల వల్ల విమానాలు గంటల తరబడి ఆలస్యం అవుతున్నాయి. ఈ పరిస్థితి ఎయిర్ లైన్స్ సిబ్బందికి తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఇంతకీ విమానయాన సిబ్బంది తలపట్టుకుంటున్న ఆ విషయం గురించి ఎయిర్ ఇండియా ఉద్యోగి ఏం చెబుతున్నారో చూద్దాం.
‘‘ప్రయాణికులు టాయిలెట్ లో... ప్లాస్టిక్ బాటిల్, డయాపర్లు, టిష్యూ పేపర్ల వంటి వాటిని పడేస్తే వాక్యూమ్ ఫ్లష్ వ్యవస్థ డ్యామేజ్ అవుతుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ వస్తువు ఎక్కడున్నదీ గుర్తించి దాన్ని తొలగించి, ఫ్లష్ ను రిపేర్ చేసిన తర్వాత గానీ తదుపరి సర్వీస్ కు సిద్ధం కాదు. దాంతో తర్వాతి ఫ్లయిట్ ఆలస్యం అవుతోంది. ఈ నష్టాలు భారీగా ఉంటున్నాయి’’ అని ఆ ఉద్యోగి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందిని వెల్లడించాడు.
‘‘పాత విమానాల్లో బ్లూ లిక్విడ్ తో కూడిన టాయిలెట్ ఫ్లష్ సిస్టమ్ వాడేవారు, వాటిల్లో బ్లాకేజ్ ఏర్పడితే వేడినీటిని పోసి కొంత సమయం తర్వాత నీటిని ఫ్లష్ చేస్తే ఏర్పడిన అడ్డంకి తొలగిపోయేది. కానీ, బోయింగ్ 777, 787 తరహా ఆధునిక విమానాల్లో వాక్యూమ్ ఫ్లష్ అనే అత్యాధునిక విధానం ఉంటోంది. ఒకసారి ఇది బ్లాక్ అయితే చేయడానికి ఏమీ ఉండదు. వాడుకునేందుకు కూడా వీలు కాదు’’ అని చెప్పుకొచ్చారు