: యూపీలో మోదీ అనుసరించిన తీరునే మనం కూడా అనుసరించాలి: సీఎం చంద్రబాబు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ అనుసరించిన తీరునే మనం అనుసరించాలని టీడీపీ శాసనసభా పక్ష నేతలతో సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్ లో టీడీపీ శాసనసభా పక్షం సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహించారు. తొలుత టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం, చంద్రబాబు మాట్లాడుతూ, యూపీలో బీజేపీ గెలవడానికి కారణాలపై ఆయన విశ్లేషించారు.
చేసిన మంచి పనులను మోదీ చెప్పడం వల్లే ప్రజలను ఆకట్టుకోగలిగారని, అదే పద్ధతిని మనం అనుసరించాలని అన్నారు. మనం చేసిన పనులను చెప్పుకోవడంలో కొంత వెనుకబడి ఉన్నామని, ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాలకు చేసిన పనుల గురించి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, అసెంబ్లీలో ప్రతి ఒక్కరి పనితీరు పర్యవేక్షిస్తామని, ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, చర్చల్లో పాల్గొనడాన్ని పర్యవేక్షిస్తానని, సమయానుకూలంగా సభలో కల్పించుకుని మాట్లాడే ప్రతిభకు అనుగుణంగా ర్యాంకులు, భవిష్యత్తులో వారికి అవకాశాలు కల్పించడం జరుగుతుందని చంద్రబాబు అన్నారు.