: మణిపూర్‌లోనూ కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం.. రేపే ప్రమాణ స్వీకారం
ఇటీవల మణిపూర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోని విషయం తెలిసిందే. అయితే ఇతరుల మద్దతుతో తమకు 32 మంది సభ్యుల మద్దతు ఉందని గవర్నర్ నజ్మా హెప్తుల్లాకు ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మద్దతు లేఖ సమర్పించడంతో.. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ బీజేపీని ఆహ్వానించారు. దీంతో రేపు మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కూడా హాజరవుతారని తెలుస్తోంది.
ఇక ఎల్లుండి బలపరీక్ష జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ 21 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్‌కి బీజేపీ కంటే 7 స్థానాలు ఎక్కువే ఉన్నాయి. అయితే, బీజేపీకి నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ మద్దతు తెలపడం, ఎల్జేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కూడా ఒక్కో రెబల్ ఎమ్మెల్యే బీజేపీ వైపు మళ్లడంతో అక్కడ బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది.