: ఆ కుటుంబాన్ని నిత్యమూ వెన్నాడుతున్న దురదృష్టం: కేఈ కృష్ణమూర్తి
భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని దురదృష్టం నిత్యమూ వెన్నాడుతూనే ఉందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఆయన ఇద్దరు సోదరులు కూడా ఇదే విధంగా గుండెపోటుతోనే మరణించారని గుర్తు చేసుకున్నారు. తొలుత అన్న భాస్కర రెడ్డి, ఆపై వీరశంకర రెడ్డి చనిపోయారని, ఆపై మూడేళ్ల క్రితం భార్య శోభా నాగిరెడ్డిని కోల్పోయినప్పటి నుంచి ఆయన మానసికంగా కృంగి పోయారని, తన కుమార్తె ఎమ్మెల్యే అయిన తరువాతనే ఆయనలో కాస్తంత మార్పు కనిపించిందని చెప్పుకొచ్చారు.
భూమాతో తాను ఎంతో కాలం పాటు కలసి పనిచేశానని, ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఎప్పుడు ఎదురైనా చిరునవ్వుతో పలకరిస్తుండే వారని, మండలాధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునని, ఆయన ధైర్య సాహసాలు తననెంతో ఆకర్షించేవని అన్నారు. భూమాకు వచ్చినటువంటి మరణం ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నానని, వారి కుటుంబానికి మేలు జరగాలని, ఇకపై వారి ఇంట్లో ఇటువంటి మరణాలు ఎవరికీ రాకూడదని చెప్పారు.