: ఎర్రగడ్డ ఆస్పత్రి వద్ద రోగి బంధువుల ఆందోళన.. సిబ్బంది నిర్లక్ష్యమే రోగి ప్రాణం తీసిందని ఆరోపణ
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే రోగి మృతి చెందాడంటూ అతడి బంధువులు హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రి వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కృష్ణ హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్యం పాలైన కృష్ణను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్చారు. అయితే వైద్యం కోసం ప్రతి చిన్నవిషయానికి లంచం అడుగుతున్నారంటూ రోగి బంధువులు ఆరోపించారు. ఆక్సిజన్ పెట్టాలంటే రూ.150, మందుల కోసం రూ.300 ఇవ్వాలని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స కోసం వచ్చినవారిని ఆస్పత్రి సిబ్బంది దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
డబ్బులిచ్చి ఆక్సిజన్ పెట్టించుకుందామన్నా అది అందుబాటులో లేదని పేర్కొన్నారు. డబ్బులివ్వకపోవడంతో తన తండ్రిని ముట్టుకునేందుకు కూడా ఎవరూ రాలేదని కుమార్తె కన్నీటిపర్యంతమైంది. పరిస్థితి విషమించడంతో అతడు మరణించాడని పేర్కొంది. ఈ ఘటనపై స్పందించిన ఆర్ఎంవో మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణ చేపడతామన్నారు. మూడేళ్ల క్రితం మీనయ్య అనే వ్యక్తి ఇలానే లంచం అడిగినందుకు సస్పెన్షన్‌కు గురైనట్టు తెలిపారు. ఏడాదిపాటు సస్పెన్షన్‌లో ఉన్న అతను తిరిగి వేరే మార్గంలో మళ్లీ ఆస్పత్రిలో చేరాడని, ఇప్పుడు మళ్లీ అతడే లంచం డిమాండ్ చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.