: మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారాన్ని నిలుపుదల చేయాలంటూ పిటిషన్.. రేపు సుప్రీంకోర్టు అత్యవసర విచారణ!
గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ రేపు ప్రమాణ స్వీకారం చేపట్టడాన్ని నిలుపు చేయాలంటూ ఆదేశాలివ్వాలన్న కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ను రేపు సుప్రీంకోర్టు అత్యవసరంగా విచారించనుంది. ఈ పిటిషన్ లో గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీని అధికారం చేపట్టేందుకు ఆహ్వానించకుండా, ద్వితీయ స్థానంలో నిలిచిన పార్టీని ప్రమాణ స్వీకారానికి పిలిచారంటూ పిటిషన్ దాఖలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఇలాంటి చర్యలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ పిటిషన్ లో పేర్కొంది. దీంతో ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిని రేపు అత్యవసరంగా విచారించనుంది. దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేగుతోంది.