: గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడానికి మా నాయకులే కారణం: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు


గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ కంటే ఎక్కువ సీట్లు సంపాదించిన‌ప్ప‌టికీ ఆ రాష్ట్రంలో ఇత‌రుల‌తో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డంలో విఫ‌ల‌మైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. త‌మ పార్టీకి ఈ ప‌రిస్థితి రావ‌డానికి త‌మ‌ పార్టీ అగ్రశ్రేణి నాయకులే కారణమని ఆరోపిస్తున్నారు. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17, బీజేపీ 13 సీట్లు గెలుచుకున్న విష‌యం తెలిసిందే. తమ వైఫ‌ల్యంపై వాల్పోయి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె మాట్లాడుతూ త‌మ‌ పార్టీ నాయకులు సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోయారని అన్నారు.

ఎన్నిక‌ల‌ ఫలితాలు వెలువడిన అనంత‌రం త‌మ నాయకులు అనుసరించిన తీరు త‌న‌ను మనస్తాపానికి గురి చేసిందని చెప్పారు. సీఎల్పీ నాయకుడిని ఎన్నుకోవడంలో ఆలస్యం చేశారని అన్నారు. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే జెన్నిఫర్ మాన్సెరట్టె మాట్లాడుతూ ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని అన్నారు. కానీ ఆ తీర్పుని గౌరవించడంలో తమ నాయకులు విఫలమయ్యారని చెప్పారు. ఇది పూర్తిగా వారి తప్పిదమని విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News