: భూమా నాగిరెడ్డి ఏ పదవులూ కోరలేదు.. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా!: చంద్రబాబు
నిన్న గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన టీడీపీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి భౌతికకాయానికి కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ... మంచినేతను కోల్పోయామని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ఆయన మృతిని తాను జీర్ణించుకోలేక పోతున్నానని చెప్పారు. ఆయన అనారోగ్యంతో ఉన్నా కూడా నంధ్యాల మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలని తనను కోరారని చెప్పారు. ఆ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశారని అన్నారు. ఇంతలోనే ఆయనకు బాగోలేదని ఫోన్ వచ్చిందని, వెంటనే ఆయనకు మెరుగైన చికిత్స కోసం తరలించడానికి హెలికాఫ్టర్ కూడా పంపించామని అన్నారు. కానీ ఆయనను దక్కించుకోలేకపోయామని చెప్పారు.
53, 54 సంవత్సరాల వయసులోనే ఆయన మృతి చెందారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. సమర్థవంతమైన నాయకుడంటే ఎలా ఉండాలో ఆయన చూపించారని అన్నారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన ఏ పని చేసినా చాలా సమర్థవంతంగా చేసేవారని అన్నారు. టీడీపీలో ఆయన ఎన్నో హోదాల్లో పనిచేశారని అన్నారు. భార్య చనిపోయిన మూడేళ్లకే భూమా నాగిరెడ్డి చనిపోవడం చాలా బాధ కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు. తెలుగు దేశం పార్టీ ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయిందని, ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఆయన జీవించి ఉంటే సేవలు రాష్ట్రానికి ఉపయోగపడేవని అన్నారు. విధిని ఎవ్వరం మార్చలేమని వ్యాఖ్యానించారు. ఆయన ఎప్పుడూ పదవులను కోరలేదని, కేవలం నంధ్యాల, ఆళ్లగడ్డల అభివృద్ధినే కోరారని చెప్పారు. ఆయన ఆశయాలను సాధ్యం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని చెప్పారు.