: హైదరాబాద్ లో మతకల్లోలాలకు ప్రయత్నాలు... ఎలర్ట్ అయిన పోలీసులు
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించిన నేపథ్యంలో, హైదరాబాద్ లో మత కల్లోలాలను సృష్టించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని పోలీసులకు పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు ఎలర్ట్ అయ్యారు. ఓ వర్గం ప్రార్థనాలయాల వద్ద మరో వర్గం బొమ్మలు పెట్టి అల్లర్లు సృష్టించేందుకు కొందరు ప్రయత్నించారని చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. ఇదే సమయంలో హిమాయత్ సాగర్ వద్ద ఓ ప్రార్థనా మందిరంపై మరో వర్గం రాతలు కనిపించడంపైనా పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు, ఎటువంటి వదంతులనూ నమ్మవద్దని, ఈ ఘటనలకు పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.