: బ్యాంకులకు షాకిద్దాం రండి... సోషల్ మీడియాలో ఉద్ధృతమైన ప్రచారం


"ఈ దేశానికి ఏమయింది? ఓ వైపు కేంద్రం, మరోవైపు ఎస్‌బీఐ... ఎవరూ నోరు మెదపరేంటి? బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్‌ చేయకండి, చేయనీకండి. బ్యాంక్‌ లావాదేవీలు చేసే వారిని ఎవ్వరినీ ఉపేక్షించకండి... నా పేరు భారతీయుడు. నేను ఒకప్పుడు బ్యాంకులో డబ్బులు బాగానే దాచుకునే వాడిని. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లయినా డిపాజిట్‌, విత్‌ డ్రా చేసే వాడిని. ఇక ముందు నేను అలా చేయలేనేమో. ఎక్కువ కాలం బ్యాంకు వాళ్ళు వడ్డించే ఛార్జీలను భరించలేను. అందుకే బ్యాంకులో డబ్బులు దాచుకోవటం మానేస్తాను. బ్యాంకుల్లో డబ్బులు దాచడం ప్రాణాంతకం. మీకు మాత్రమే కాదు... మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా" బ్యాంకుల్లో నగదు కొరత, నిండుకున్న ఏటీఎంల గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సందేశం ఇది.

ఎవరు ప్రారంభించారో తెలియదుగానీ, బ్యాంకుల సర్వీస్ చార్జీలు, లావాదేవీల పరిమితులపై ఆగ్రహం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఈ తరహా పోస్టులకు వేల సంఖ్యలో లైకులు వస్తున్నాయి. ఎంతో మంది వీటిని షేర్ చేస్తూ, బ్యాంకులకు బుద్ధి చెప్పాలని, 'నో బ్యాంకింగ్ డే' జరుపుదామని ఎంతో మంది నెటిజన్లు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు. బ్యాంకుకు వెళ్లకుంటే, ఒక రోజు వడ్డీ ప్లస్ అవుతుందే తప్ప, నష్టం లేదని, ఖాతాల్లోని చివరి పైసాను కూడా తీసుకుని ఇంట్లో దాచుకోవాలని, ఆర్థిక సంవత్సరం చివర బ్యాలెన్స్ లు తగ్గితే, టార్గెట్లు పూర్తికాక, బ్యాంకులు దారిలోకి వస్తాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

 బ్యాంకుల్లో డబ్బు వేస్తే, దాన్ని వడ్డీలకు తిప్పుకుంటూ, తిరిగి ఖాతాదారులపైనే చార్జీలు వేస్తున్న బ్యాంకుల సంగతి తేల్చాల్సిందేనన్న ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. మార్చి 31లోగా ఖాతాలోని మొత్తం డబ్బు వెనక్కు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా వేలమంది ప్రచారం సాగిస్తున్నారు. ఇక ఈ ప్రభావం 10 శాతం ఉన్నా, బ్యాంకులు తీవ్రంగా నష్టపోవడం ఖాయమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News