: 21 ఏళ్ల క్రితం ఇదే రోజున వన్డే ప్రపంచకప్ లో టీమిండియాకు చేదు అనుభవం


అది 1996 క్రికెట్ వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్. మార్చి 13 న జరిగిన ఆ మ్యాచ్‌లో భార‌త్‌, శ్రీ‌లంక త‌ల‌ప‌డుతున్నాయి. స‌చిన్ టెండూల్క‌ర్‌, మహ్మద్ అజహరుద్దీన్ లాంటి వారు మంచి ఫాంలో ఉన్న ఆ స‌మ‌యంలో టీమిండియా చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌ప‌ర్చ‌డంతో మైదానంలో టీమిండియా అభిమానుల ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. క‌నీస‌ పోరాటపటిమ కనబరచకుండా టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఒకరి త‌రువాత ఒక‌రు క్రీజు నుంచి వెనుదిరుగుతుండ‌డంతో అభిమానులు స్టేడియంలోని కొన్ని స్టాండ్లకు నిప్పుపెట్టారు. త‌మ చేతిలోని వాటర్ బాటిళ్లు మైదానంలోకి విసిరేశారు. దీంతో అల‌జ‌డి చెల‌రేగి కొద్దిసేపు మ్యాచ్ నిలిచిపోయింది.

అయితే, ఆట తిరిగి ప్రారంభ‌మైన తరువాత కూడా ప్రేక్షకులు మళ్లీ మైదానంలోకి బాటిళ్లు విసిరారు. దీంతో మ్యాచ్ రిఫరీ ఆటను నిలిపివేశారు. అప్పటివరకు నమోదైన స్కోర్ల ప్రకారం శ్రీలంక ఆధిక్యంలో ఉండ‌డంతో ఆ జ‌ట్టే గెలిచినట్టు ప్రకటించారు. దీంతో తొలిసారిగా శ్రీలంక వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్లోకి ప్ర‌వేశించింది. అనంత‌రం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో ఓడించి శ్రీలంక జ‌ట్టు తొలిసారి కప్ కొట్టేసింది.

ఆ నాటి ఘ‌ట‌న ఇప్ప‌టికీ టీమిండియా అభిమానుల మెద‌ళ్లలోనే ఉంది. భారత జట్టు ఆ రోజు అవమానకరరీతిలో ఓటమి పాలై అభిమానుల ఆగ్రహావేశాలతో ప్రపంచకప్ పోటీ నుంచి నిష్క్రమించింది. ఆ జ‌ట్టుకి కెప్టెన్‌గా మహ్మద్ అజహరుద్దీన్ ఉన్నారు. ఆ మ్యాచులో శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన శ్రీ‌లంక... అనంత‌రం బ్యాట్స్‌మెన్‌ అరవింద్ డిసిల్వా, రోహన్ మహనామ క్రీజులో కాసేపు నిల‌దొక్కుకుని హాఫ్ సెంచ‌రీలు సాధించారు. డిసిల్వా 47 బంతుల్లో 14 ఫోర్లతో 66 పరుగులు చేయ‌గా, మ‌హ‌నామ 101 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేశాడు.

శ్రీ‌లంక ఓ వైపు ధాటిగా ఆడి గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు న‌మోదు చేసుకుంటే టీమిండియా మాత్రం సొంత గ‌డ్డ‌పై చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంత‌రం సచిన్ టెండూల్కర్, మంజ్రేకర్ ఆచితూచి ఆడి 98 పరుగుల వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, 98 పరుగుల వద్ద సచిన్ రెండో వికెట్ గా అవుట్ కాగా అనంత‌రం అజహరుద్దీన్ డకౌట్ అయ్యాడు. 99 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా బ్యాట్స్‌మెన్ ఒక‌రి త‌రువాత ఒక‌రు పెవిలియన్‌కు వరుస కట్టారు. దీంతో 34.1 ఓవరల్లో 120 పరుగులు మాత్రమే చేసిన‌ 8 వికెట్లు కోల్పోయింది. వారిలో ముగ్గురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావ‌డంతో మైదానంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News