: హైద‌రాబాద్‌లో దారుణం.. భార్యపై అనుమానంతో కుమార్తెను చంపేసిన తండ్రి!


భార్య‌పై అనుమానంతో ఓ వ్య‌క్తి అభం శుభం తెలియ‌ని త‌మ కూతురిని హ‌త్య చేసిన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో చోటుచేసుకుంది. భీమవరం ప్రాంతానికి చెందిన పతివాడ సురేష్ అనే వ్య‌క్తి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ హోటల్‌లో పని చేసేవాడు. ఆ స‌మ‌యంలో దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌కి చెందిన ఓ యువతిని ప్రేమించి, పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె జన్మించింది. అనంత‌రం ఆ యువ‌తికి భ‌ర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. అనుమానంగా మాట్లాడుతూ భ‌ర్త త‌న‌తో ప‌దేప‌దే గొడ‌వ ప‌డుతుండ‌డంతో ఆమె తల్లిగారింటికి వెళ్లిపోయి, కొన్ని నెల‌ల‌కు మ‌ళ్లీ వ‌చ్చేది.

నెలన్నర క్రితం సురేష్ త‌న‌ భార్య, కుమార్తెను ఆమె పుట్టింటి నుంచి తీసుకుతెచ్చుకున్నాడు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 23లో ఓ ఇంటికి సెక్యూరిటీగా చేరి వారు అక్కడే ఉంటున్నారు. అయితే మొన్న సాయంత్రం ఇంటికి తాగి వచ్చిన సురేష్‌ తన కుమార్తెను బ‌య‌ట‌కు తీసుకెళ్లాడు. అనంతరం, కొద్ది సేపటికే ఆ చిన్నారి ఇంటిముందు తీవ్ర‌ గాయాల‌తో క‌నప‌డింది. ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించినప్పటికీ లాభం లేక‌పోయింది. తండ్రే ఆమెను హత్య చేసే ఉద్దేశంతో గాయపరచాడని అనుమానిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారిపై అత్యాచారం జరిగిందా? అన్న కోణంలోనూ దర్యాప్తు జ‌రుపుతున్నారు.

  • Loading...

More Telugu News