: భార్య పక్కనే భూమాకు శాశ్వత విశ్రాంతి... చురుకుగా సాగుతున్న ఏర్పాట్లు
దాదాపు రెండున్నరేళ్ల క్రితం శోభానాగిరెడ్డి మరణించినప్పుడు అంత్యక్రియలు జరిపిన చోటనే నేడు భూమా నాగిరెడ్డికి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆళ్లగడ్డలోని శోభా ఘాట్ పక్కనే భూమాకు చివరి వీడ్కోలు పలకనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శోభా ఘాట్ పేరును ఇకపై భూమా ఘాట్ గా మార్చి, చుట్టూ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు భూమా మృతదేహాన్ని ఊరేగింపుగా శోభా ఘాట్ కు తీసుకువెళ్లనున్నారు. ఇప్పటికే శోభా ఘాట్ కు దారితీసే మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, రాకపోకలను నియంత్రిస్తున్నారు. భూమా అంత్యక్రియల్లో చంద్రబాబుతో పాటు, స్పీకర్ కోడెల, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.