: మోసాలెక్కువగా ఈ బ్యాంకుల్లోనే... ఆర్ బీఐ నివేదిక విడుదల!


దేశంలో ఎక్కువగా మోసగాళ్లకు లక్ష్యంగా మారుతున్న వాటిలో ఐసీఐసీఐ బ్యాంకు మొదటి స్థానంలో ఉంది. 2016 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల కాలానికి సంబంధించి ఆర్ బీఐ గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతోంది. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్ బీఐ రెండో స్థానంలో ఉంది. రూ. లక్ష అంతకంటే ఎక్కువ విలువతో కూడిన మోసాలు ఐసీఐసీఐ బ్యాంకులో 455 చోటు చేసుకున్నాయి.

ఇక ఎస్ బీఐలో ఈ సంఖ్య 429, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో 244, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 237 మోసాలు జరిగాయి. ఆర్ బీఐకి బ్యాంకులు అందజేసిన సమాచారం ప్రకారం యాక్సిస్ బ్యాంకులో 189, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 176, సిటీ బ్యాంకులో 150 మోసపూరిత ఘటనలు నమోదయ్యాయి. మోసాల కారణంగా నష్టపోయిన విలువ పరంగా చూస్తే ఎస్ బీఐ రూ.2,236 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.2,250 కోట్లు, యాక్సిస్ బ్యాంకు రూ.1998 కోట్ల చొప్పున లెక్క తేలింది.

ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖకు ఆర్ బీఐ అందించింది. వీటిలో బ్యాంకు సిబ్బంది పాత్ర కూడా ఉందని తెలియచేసింది. ఎస్బీఐలో ఇలా మోసాల్లో పాలు పంచుకున్న ఉద్యోగుల సంఖ్య 64 కాగా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 49 మంది,  యాక్సిక్ బ్యాంకులో 35 మంది ఉన్నారు. మొత్తం వివిధ బ్యాంకుల తరఫున 450 మంది సిబ్బంది ఈ విధమైన మోసాల్లో తమ వంతు పాత్ర పోషించారు. మోసాలకు సంబంధించి మొత్తం 3,870 కేసులు నమోదు కాగా, వాటి విలువ రూ.17,750 కోట్లు.

  • Loading...

More Telugu News