: యూపీ సీఎం రేసులో నలుగురు... ఎవరికి దక్కెను సీటు?
యూపీలో బీజేపీ ఘన విజయం తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఎవరు ఎంపిక అవుతారన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, గోరఖ్ పూర్ ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్, కేంద్ర టెలికం శాఖా మంత్రి మనోజ్ సిన్హాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో మనోజ్ సిన్హా ముందున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేరు వినిపిస్తున్నప్పటికీ ఆయన సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.
గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు యూపీనే కీలకం. అప్పుడు ఈ రాష్ట్రంలో 73 లోక్ సభ స్థానాల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో బీజేపీ మరోసారి కేంద్రంలో పీఠాన్ని కాపాడుకోవాలంటే మళ్లీ యూపీలోనూ గణనీయమైన సీట్లను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎవరైనా ప్రజాకాంక్షలకు అనుగుణంగా పనిచేసే విధంగా ఉండాలన్నది అమిత్ షా వ్యూహంగా తెలుస్తోంది.
ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సత్పాల్ మహారాజ్, దేవేంద్ర రావత్, ప్రకాష్ పంత్ ముందు వరుసలో ఉన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నేడు సమావేశమై సంప్రదింపుల అనంతరం యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సంబంధించి సీఎం అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే, మణిపూర్, గోవాల్లో ఫలితాల్లో హంగ్ నెలకొనడంతో అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.