: ఎన్నికల సందర్భంగా కొందరు కులాలు, మతాలను రెచ్చగొట్టారు: వెంకయ్య విసుర్లు
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించిన సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రంగుల పండుగ హోలీ సందర్భంగా ప్రజలు ఇచ్చిన కానుక ఇదని అన్నారు. దేశ ప్రజలంతా మోదీని దేవుడు తమకు ఇచ్చిన వరంగా భావిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల సందర్భంగా కొందరు కులాలు, మతాలను రెచ్చగొట్టారని అన్నారు. ప్రధాని మంత్రి చేస్తోన్న నల్లధన పోరాటానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారని వెంకయ్య అన్నారు. మోదీ అంటే మేకింగ్ ఆఫ్ డెవెలప్డ్ ఇండియా అని ఆయన అభివర్ణించారు.
మోదీ నాయకత్వంలో తమ భవిష్యత్తు బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారని వెంకయ్య నాయుడు అన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో పేదలు ఎక్కువగా ఉంటారని, మోదీనే వారికి మేలు చేస్తారని వారు భావించారని అన్నారు. గోవాలోనూ బీజేపీకి సానుకూలంగా ఫలితాలు వస్తున్నాయని, మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయినప్పటికీ తనకు అందిన సమాచారం బట్టి ఆ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని అన్నారు. మోదీ ప్రవేశపెట్టిన పథకాలు పేదలను ఎంతగానో ఆకర్షించాయని అన్నారు. మోదీ ఈ రోజు దేశాన్ని ముందుకు తీసుకెళతాడన్ని దృఢ విశ్వాసం వారిలో ఉందని చెప్పారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించాలని అన్నారు. కొందరు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఓటమిని భరించలేకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.