: మరో ఐదేళ్ల తరువాత పెళ్లి చేసుకుంటాను: 'జయం' ఫేమ్ కల్యాణి
ఐదేళ్ల తరువాత పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటానని జయం ఫేమ్ (హీరోయిన్ సదా చెల్లెలి పాత్రధారి) కల్యాణి తెలిపింది. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు సీరియల్స్, సినిమాల్లో నటించానని చెప్పింది. జయం సినిమా ఆడిషన్స్ కు తన తండ్రి తన ఫోటోలు పంపారని చెప్పింది. తేజ చాలా బాగా చూసుకున్నారని, సినిమా షూటింగ్ పిక్నిక్ లా ముగిసిందని చెప్పింది. తరువాత చాలా సినిమాల్లో నటించానని చెప్పిన కల్యాణి, బాగా చదువుతుండడంతో తన తల్లిదండ్రులు చదువుకే ముందు ప్రాముఖ్యత ఇవ్వమన్నారని చెప్పింది. బ్యాచులర్స్ విద్య పూర్తయిన తరువాత విప్రోలో ఉద్యోగం వచ్చిందని, అందులో చేసిన తరువాత యూఎస్ లో ఎంఎస్ చేశానని తెలిపింది.
ప్రస్తుతం ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నానని చెప్పింది. సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని తెలిపిన కల్యాణి, మంచి కథ నచ్చితే చేయడానికి సిద్ధమని చెప్పింది. తన భవిష్యత్ కోసం ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదని, తను ఏం చేయాలో అది వందశాతం పట్టుదలతో చేస్తూ ముందుకు పోతున్నానని, జీవితం ఎటు తీసుకెళ్తే అటు నడుస్తున్నానని చెప్పింది. ఈ క్రమంలో సినిమాల్లో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలిపింది. మరో ఐదేళ్ల తరువాత ఏం చేస్తానంటే ప్లాన్ లేదని.... బహుశా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటానేమోనని చెప్పింది. తనకు మంచి ఎంటర్ ప్రెన్యూర్ గా నిలవాలని ఉందని, అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే మంచిదేనని, అలా జరగకపోతే ఇంకేదో జరుగుతుందని కల్యాణి తెలిపింది.