: ప్రభుత్వ ఒత్తిడికి గవర్నర్ లొంగిపోయారు: ప్రసంగంపై రేవంత్ రెడ్డి విమర్శలు
ఈ రోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా గవర్నర్ నరసింహన్ అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగంతో చివరిపేజీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిరహితంగా పాలన కొనసాగిస్తోందని చెప్పారని ఆయన అన్నారు. ఇంతకంటే అబద్ధం ఈ రాష్ట్రంలో మరొకటి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ప్రసంగంలో నూటికి నూరు శాతం అబద్ధాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం పంపించే ప్రసంగంలో నిజానిజాలు పరిశీలించి ఆ తరువాత ప్రసంగించాలని తాను గవర్నర్ ను కోరినట్లు తెలిపారు. అయితే, గవర్నర్ తన సూచనను పట్టించుకోలేదని అన్నారు. ప్రభుత్వం ఒత్తిడికి గవర్నర్ లొంగిపోయారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి రాజయ్యను ఆ కారణంతోనే మంత్రి వర్గం నుంచి తొలగించారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి తెలపాలని ఏర్పాటు చేసిన ఫోన్ నెంబరుకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయన్న విషయం గవర్నర్ తన ప్రసంగంలో చెప్పి ఉంటే ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని అనుకోవచ్చని అన్నారు. ఆ విషయం గురించి తెలపలేదని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను కాపాడుతోందని గవర్నర్ చెప్పారని, అది కూడా అసత్యమేనని అన్నారు. మంత్రి వర్గం ఆమోదించిన తరువాతే గవర్నర్‌కి ఆ ప్రసంగం పంపించాలని, కనీసం అది కూడా చేయలేదని అన్నారు. ప్రసంగం అంతా యాంత్రికంగా చెప్పినట్లు ఉందని అన్నారు.