: స్విట్జర్లాండ్ కేఫ్‌లో కాల్పులు.. ఇద్దరి దుర్మరణం
అమెరికాలోని కాన్సస్‌లో ఓ బార్‌లో జరిగిన కాల్పుల ఘటనను మర్చిపోకముందే స్విట్జర్లాండ్‌లోని ఓ కేఫ్‌లో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. వాయవ్య స్విట్జర్లాండ్‌లోని బాసెల్ ప్రాంతంలో ఉన్న ‘కేఫ్ 56’లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వినియోగదారులు దుర్మరణం పాలవగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. కాల్పుల వెనక ఉన్న ఉద్దేశం తెలియరాలేదని, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు బాసెల్ ప్రాసెక్యూటర్ కార్యాలయం తెలిపింది. స్విట్జర్లాండ్‌లో ఇటువంటి ఘటనలు జరగడం చాలా అరుదు. అయితే మిలటరీ సర్వీసు పూర్తిచేసుకున్న వారు ఇళ్లలో ఆయుధాలు ఉంచుకోవడం ఇక్కడ సాధారణమే. దీనిపై విమర్శలు కూడా ఉన్నాయి.