: మళ్లీ మొదలైన 'కిస్ ఆఫ్ లవ్'
2014లో జరిగిన 'కిస్ ఆఫ్ లవ్' నిరసనలు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. కేరళలోని కోజికోడ్ లో ఓ హోటల్ లో భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు చేసిన దాడులకు నిరసనగా ఈ కార్యక్రమం అప్పట్లో ప్రారంభమైంది. ఇప్పుడు మళ్లీ 'కిస్ ఆఫ్ లవ్' ఆందోళనలకు రంగం సిద్ధమైంది. మహిళా దినోత్సవం రోజున కొచ్చిలో జరిగిన మోరల్ పోలీసింగ్ ఘటనకు వ్యతిరేకంగా స్వేచ్ఛావాదులు ఈ ఆందోళనకు పిలుపు నిచ్చారు. ఈ సాయంత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. యువ జంటలపై శివసేన కార్యకర్తలు చేసిన దాడులకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు స్వేచ్ఛావాదులు ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. మద్దతుదారులంతా మెరైన్ డ్రైవ్ ప్రాంతానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అయితే, మోరల్ పోలీసింగ్ ఘటన నేపథ్యంలో ఓ ఎస్ఐని సస్పెండ్ చేశారు. మరో ఎనిమిది మంది పోలీసులను ఆర్మ్ డ్ రిజర్వ్ కు బదిలీ చేశారు.