: సహజీవనం చేశాడు.. పెళ్లి చేసుకుందామంటే ఆమెను చంపేశాడు!


గత మూడేళ్లుగా ఓ యువకుడితో ఓ మహిళా టెక్కీ సహజీవనం చేస్తోంది. ఈ వ్యవహారం మహిళ కుటుంబ సభ్యులకు తెలియడంతో, వారు మండిపడ్డారు. దీంతో, పెళ్లి చేసుకుందామని ఆ యువకుడిని కోరిన మహిళా టెక్కీని  గొంతు నులిమి చంపేశాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఉన్న బద్లాపూర్ లో నిన్న రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాసిక్ కు చెందిన పూనం పూన్యకర్ గజ్ బియే ముంబైలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తోంది. గత మూడేళ్లుగా బద్లాపూర్ లో నివసిస్తున్న ఆమె, విజయ్ సంజయ ఝార్కడ్ (22) అనే యువకుడితో సహజీవనం చేస్తోంది.

అయితే, ఈ వ్యవహారం పూనం కుటుంబ సభ్యులకు తెలియడంతో, వారు దీనిని వ్యతిరేకించారు. ఈ విషయాన్ని ఝార్కడ్ కు పూనం చెప్పింది. తమ అనుబంధం కొనసాగాలంటే పెళ్లి చేసుకోకతప్పదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో.. వారి మధ్య జరిగిన గొడవ ఘర్షణకు దారి తీసింది. ఆ ఆవేశంలో పూనం చున్నీని ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. అనంతరం, అక్కడి నుంచి తన స్నేహితుడి ఇంటికి పారిపోయాడు. ఈ విషయం తన స్నేహితుడికి చెప్పడంతో, అతను పోలీసులకు సమాచారం అందించాడు.

ఈ సందర్భంగా జోన్ 4 డిప్యూటీ కమిషనర్ సునీల్ భరద్వాజ్ మాట్లాడుతూ, బద్లాపూర్ లోని ఓ మొబైల్ రిపేర్ షాపులో పూనం, ఝార్కడ్ మొట్టమొదట కలిశారని, ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని అన్నారు. కొన్నాళ్లుగా వాళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారని, ఆరు నెలల కిందట పూనం కొనుగోలు చేసిన ఓ ఇంట్లో వాళ్లిద్దరూ కలిసి జీవించారని చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News