: చంద్రబాబు గారూ, మొదటి ఛార్జిషీట్ లో 26 సార్లు, రెండో ఛార్జిషీట్ లో 22 సార్లు మీ పేరుంది... ఏం సమాధానం చెబుతారు?: బొత్స


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'చంద్రబాబు గారూ! ఓటుకు నోటు కేసులో మొదటి ఛార్జిషీట్ లో 26 సార్లు, రెండో చార్జిషీట్ లో 22 సార్లు తమరి పేరు వుంది... ఈ విషయంలో ప్రజలకు మీరు ఏం సమాధానం చెబుతారు?' అంటూ ప్రశ్నించారు. 'తమరు నిప్పా? లేక తుప్పా? తమరే చెప్పండి' అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల్లోకి చంద్రబాబు మంచి సందేశం పంపాలనుకుంటే...  వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని చెప్పారు.

దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా వారిపై ఛార్జిషీట్ దాఖలైనప్పుడు, వారు పదవిలో కొనసాగలేదని అన్నారు. ఓటుకు నోటు కేసు తెరపైకి రాగానే చంద్రబాబు హైదరాబాదును వదిలి విజయవాడకు వెళ్లిపోయారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంతో లాలూచి పడ్డ చంద్రబాబు... ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని అన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను కూడా పక్కన పెట్టేశారని విమర్శించారు. చంద్రబాబుకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా... వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News