: ఇంటర్నేషనల్ టాప్ మోడల్ పై మాజీ ప్రియుడి యాసిడ్ దాడి!
జెస్సికా నొటారో... మాజీ మిస్ ఇటలీ. ఇంటర్నేషనల్ టాప్ మోడళ్లలో ఒకరు. ఒకప్పుడు ఆమె మనసుపడ్డ ప్రియుడు, ఇప్పుడు మాజీ బాయ్ ఫ్రెండ్ అయిన జార్జ్ ఎడ్సన్ టవారెస్, అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ, ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు. తీవ్రగాయాలైన ఆమె, ప్రస్తుతం చూపును కోల్పోయే స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాణాపాయం లేనప్పటికీ, ఆమెకు పలు దఫాలుగా ప్లాస్టిక్ సర్జరీలు అవసరమని, ఆమె కాళ్లు, పిరుదులపైనా యాసిడ్ పడిందని వైద్యులు వెల్లడించారు.
టీవీ యాంకర్ గా, డాల్ఫిన్లకు శిక్షకురాలిగా రాణిస్తున్న ఆమె 2014లో ఎడ్సన్ ను కలిసింది. రెండేళ్ల పాటు ప్రేమాయణం జరిపిన వీరు గత సంవత్సరం విడిపోయినప్పటికీ, అతను వెంటపడుతూనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆపై తిరిగి కలిసేందుకు నొటారో ససేమిరా అనడంతో ఈ పని చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎడ్సన్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.