: ముదిరి పాకానపడ్డ వార్నర్, హర్భజన్ ట్విట్టర్ వార్
బోర్డర్ అండ్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భారత్-ఆస్ట్రేలియా జట్లు చెరొక టెస్టు మ్యాచ్ లో విజయం సాధించి సమఉజ్జీలుగా నిలిచాయి. సిరీస్ ప్రారంభంలో ఆస్ట్రేలియా జట్టు గతంలో అంత బలంగా లేదని, బలహీనమైన ఆస్ట్రేలియా జట్టుపై భారత్ గెలుస్తుందని, భారత్ చేతిలో ఆసీస్ ఘోరపరాజయం పాలవుతుందని వెటరన్ లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా విజయం సులువు కాదని చెబుతూ, హర్భజన్ సింగ్ ఇప్పుడున్న ఆసీస్ జట్టు బలహీనమైనదని, భారత్ ఖచ్చితంగా 4-0 క్లీన్ స్వీప్ చేస్తుందని ట్వీట్ చేశాడు.
ఈ నేపథ్యంలో పూణే టెస్టులో భారత్ ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే... దీనిపై హర్భజన్ కు సమాధానమిస్తూ, ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్... 'అవును హర్భజన్.. టీమిండియా సిరీస్ ను 4-0 తేడాతో గెలుచుకుంటుంది' అంటూ ఎద్దేవా చేశాడు. అతనితోపాటు ఆసీస్ అభిమానులు కూడా హర్భజన్ పై ట్వీట్ట యుద్ధం చేశారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విజయం సాధించడంతో వార్నర్ కు హర్భజన్ సింగ్ కౌంటర్ ఇచ్చాడు. ఈ మేరకు ట్వీట్ చేసిన భజ్జీ...‘వెల్ డన్ మై బాయిస్, ఇదే ఊపుతో రెండు టెస్టుల్లో విజయం సాధించాలి’ అని పేర్కొన్నాడు. దీంతో వీరిద్దరి మధ్య ట్వీట్ట యుద్ధం ముదిరి పాకానపడుతోందని అభిమానులు పేర్కొంటున్నారు.