: హైదరాబాదులో మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న నైజీరియన్ అరెస్ట్


జల్సాలకు అలవాటుపడి... సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మత్తు పదార్థాలు రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు ఓ విదేశీయుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విజిటింగ్ వీసాపై నగరానికి వచ్చిన నైజీరియాకు చెందిన పాట్రిక్ విలియమ్స్ ఒజొన్న రంగారెడ్డి జిల్లా సన్ సిటీలో నివాసం వుంటున్నాడు. ఇతడికి ఓ పబ్ లో కెన్యాకు చెందిన డేవిస్ క్రిస్ రిచర్డ్ అలియాస్ కొల్లిన్స్ పరిచయం అయ్యాడు. జల్సాలకు అలవాటు పడ్డ విలియమ్స్ సులువుగా డబ్బులు సంపాదించే క్రమంలో మాదకద్రవ్యాలను విక్రయించాలని నిర్ణయించాడు.

కొల్లిన్స్ వద్ద నుంచి తక్కువ ధరకే మాదకద్రవ్యాలను కొనుగోలు చేసి, వాటిని మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్మేవాడు. అలా ఒక గ్రాము మత్తుపదార్థాన్ని కొల్లిన్స్ వద్ద నుంచి 2 వేలకు కొనుగులు చేసి దాన్ని బయట రూ. 5 వేల నుంచి 6 వేల వరకు అమ్మేవాడు. ఇటీవల హైదరాబాదు, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో తూర్పుమండలం పోలీసులు తనిఖీలు చేస్తుండగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న విలియమ్స్ పై అనుమానం వచ్చి  వాహనం ఆపి తనిఖీ చేయగా, అతని వద్ద 15 గ్రాముల మత్తు పదార్థం లభించింది. వెంటనే పోలీసులు విలియమ్స్ ను అదుపులోకి తీసుకొని, అతని వద్ద వున్న మొబైల్ ఫోన్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు కొల్లిన్స్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 

  • Loading...

More Telugu News