: అరెస్ట్ అవుతున్న అభిమానులకు రక్షణగా కమలహాసన్ కార్యాచరణ!
తమిళనాడు వ్యాప్తంగా ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ అభిమానుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ అరెస్టులకు అడ్డుకట్ట వేసేందుకు కమల్ కార్యరంగంలోకి దిగారు. జిల్లాల వారీగా లాయర్ల కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.
జయలలిత చనిపోయిన తర్వాత అధికారం కోసం పాకులాడిన అన్నాడీఎంకే నేతలపై కమలహాసన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేశారు. కమల్ ట్వీట్లు అధికారవర్గంలో ప్రకంపనలు పుట్టించాయి.
ఈ నేపథ్యంలో, జల్లికట్టు సందర్భంగా మంత్రి విజయభాస్కర్ ను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ, కమల్ అభిమానులు పోస్టర్లు అతికించడంపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు అభిమానులపై కేసులు నమోదయ్యాయి. ఇలాంటి అక్రమ కేసులను, అరెస్టులను ఎదుర్కొనేందుకు... ఇప్పుడు లాయర్ల కమిటీలను కమల్ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు 25 మంది లాయర్లతో ఈ కమిటీలు ఏర్పాటవుతున్నాయి.