: శశికళను కలిసేందుకు వారికి అనుమతి ఇవ్వద్దు: హైకోర్టులో పిటిషన్
అవినీతి, అక్రమాస్తుల కేసులో శిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను కలిసేందుకు బెంగళూరులోని పరప్పన అగ్రహార కారాగారానికి ఆ పార్టీ నేతలు భారీగానే వస్తున్నారు. ఈ నేపథ్యంలో, శశికళను తమిళనాడు మంత్రులు కలుసుకోకుండా చూడాలని, కలిసేందుకు వారికి అనుమతి ఇవ్వరాదంటూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను సంఘ సేవకుడు ట్రాఫిక్ రామస్వామి వేశారు.
ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, గత నెల 15వ తేదీ నుంచి శశికళ, ఇళవరసి, సుధాకరన్ లు జైల్లో ఉన్నారని... అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న వారిని కలిసేందుకు అన్నాడీఎంకే ప్రముఖులు పోటీ పడుతున్నారని మండిపడ్డారు. పరిపాలనను గాలికొదిలేసి, శశికళను కలుసుకునేందుకు మంత్రులు క్యూ కడుతుండటం సరైంది కాదని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను కోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు.