: 20 వసంతాల వెబ్
మీరు ఆన్ లైన్లో ఈ వార్త చదువుతున్నారు. మీరే కాదు ఇలా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వెబ్ ప్రపంచంలో సమాచారం అందుకోవడానికి వీలు కల్పించిందే వరల్డ్ వైడ్ వెబ్(www). వెబ్ సైట్లను ఇలా విశ్వవ్యాప్తంగా ఎవరైనా వీక్షించడానికి అనుకూలించే వాహకమే www. నేడు ఏ సమాచారం కావాలన్నా గూగుల్ కు వెళ్లి టైప్ చేసేస్తాం. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో పోస్టులతో కాలక్షేపం, అరచేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని అమెరికా ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకుంటాం. ఇదంతా www పుణ్యమే. ఇది 20 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఇలా ఉచితంగా వెబ్ ప్రపంచాన్ని మానవాళి ముందుకు తీసుకొచ్చిన రోజు 1993 ఏప్రిల్ 30. జెనీవాలోని యూరోపియన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(సిఇఆర్ఎన్) ఇదే రోజున www ఉచితమని ప్రకటించింది. దీనిని కనిపెట్టిన మహనీయుడు బ్రిటిష్ ఇంజనీర్, కంప్యూటర్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్న్ లీ. ప్రస్తుతం వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియాని(ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ప్రమాణాలను నిర్దేశించేది)కి ఈయనే డైరెక్టర్ గా ఉన్నారు. 1991 ఆగస్టున 6న ఆన్ లైన్లోకి వచ్చిన తొలి సైట్ http://info.cern.ch. ఇది అప్పుడు పెయిడ్ సైట్. ఇప్పుడు మనం గూగుల్ వాడుతున్నట్లుగా తొలినాళ్లలో వాడుకలోకి వచ్చిన సెర్చ్ ఇంజన్ ఆర్చీ. వాస్తవానికి ఇంటర్నెట్ వేరు వెబ్ వేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లన్నింటినీ ఆన్ లైన్లో ఏకం చేసేది ఇంటర్నెట్. సమస్త సమాచారాన్ని( ఫొటోలు, వీడియోలు, ఫైళ్లు, సమాచారం ) అందుకోవడానికి తోడ్పడేదే వెబ్.