: మరో పిడుగు... హెచ్-1బీ వీసాలున్న వారి భాగస్వామికి ఉద్యోగ అర్హత కట్!


 హెచ్-1బీ వీసాలను పొంది అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారిపై మరో పిడుగులాంటి వార్త ఇది. ఈ వీసాలను పొందిన వారి జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు ఉన్న హక్కును తొలగించాలని ట్రంప్ సర్కారు తీవ్ర నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. హెచ్-1బీ వీసా పొందిన ఉద్యోగుల భాగస్వాములు పని చేయకుండా చట్టం మార్చాలని దాఖలైన పిటిషన్ పై సమాధానం ఇచ్చేందుకు ట్రంప్ సర్కారు 60 రోజుల సమయం కావాలని కోరింది. కొన్ని అమెరికా సంఘాలు, ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమకు అన్యాయం జరుగుతోందని వాషింగ్టన్ లోని ఫెడరల్ కోర్టులో కేసు వేయగా, దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ చట్టం మార్పునకే ట్రంప్ ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తుండటంతో, ఇప్పటివరకూ ఆనందంగా ఉన్న ఇండియా సహా, పలు దేశాల హెచ్-1బీ వీసా ఉద్యోగులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంలో కొంత చర్చ జరగాల్సి వుందని, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నేతలతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం కోర్టును కోరింది. కాగా, ప్రస్తుతం అటార్నీ జనరల్ గా ఉన్న జెఫ్ సెషన్స్, తాను యూఎస్ సెనెటర్ గా ఉన్న సమయంలో వీసా నిబంధనల్లోని హెచ్-4 నిబంధన, అమెరికన్ కార్మికులకు నష్టం కలిగించేలా ఉందని, ఇమిగ్రేషన్ చట్టంలో మార్పులు తేవాలని, వీసాలపై వచ్చిన వారి భార్యలు లేదా భర్తలకూ ఉద్యోగ హక్కు ఉండరాదని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీసా నిబంధనలను కఠినం చేయాలని భావిస్తున్న ట్రంప్, ఇదే అదనుగా కఠిన నిర్ణయానికే మొగ్గు చూపవచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News