: ఇండియాలో జాగ్రత్త... అమెరికన్లను హెచ్చరించిన యూఎస్ ప్రభుత్వం
ఇండియా సహా, దక్షిణాసియా దేశాల్లో పర్యటిస్తున్న తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ లలో పర్యటించేవారితో పాటు ఇండియాలో ఉన్న వారు సైతం తగు జాగ్రత్తలతో ఉండాలని సలహాలు ఇస్తూ, ప్రకటన వెలువరించింది. బంగ్లాదేశ్ లోని ఉగ్రవాదులు ఏ క్షణమైనా అమెరికన్లు లక్ష్యంగా దాడులు జరపవచ్చని, ఇండియాలో సైతం తీవ్రవాద సంస్థలు యాక్టివ్ గా ఉన్నాయని పేర్కొంది. యూఎస్ సంస్థల కార్యాలయాలు, అమెరికన్ పౌరులు లక్ష్యంగా దాడులు జరగవచ్చని తెలిపింది. ఆఫ్గన్ లోని ఏ ఒక్క ప్రాంతం కూడా క్షేమకరమని చెప్పలేమని, పాక్ లో ఇటీవలి ఉగ్రదాడుల్లో 130 మంది మరణించగా, వందలమంది గాయపడ్డారని పేర్కొంది. ప్రస్తుతం ఈ దేశాల్లో పర్యటిస్తున్న అమెరికన్లు, ఉద్యోగ విధి నిర్వహణలో భాగంగా ఉన్న వారు స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించింది.