: హీరో సుదీప్‌ను హత్తుకున్న ఆనందంలో ఆగిపోయిన అభిమాని గుండె!
అభిమాన హీరోను హత్తుకున్న ఆనందాన్ని ఆ అభిమాని గుండె తట్టుకోలేకపోయింది. ఆ మధుర జ్ఞాపకాన్ని గుండెల్లో పదిలపరుచుకునేందుకు సిద్ధపడుతుండగానే ఆ గుండె కాస్తా ఆగిపోయింది. కర్ణాటకలోని తుముకూరులో ఈ విషాదం చోటుచేసుకుంది. కన్నడ నటుడు సుదీప్ కొత్త సినిమా ‘హెబ్బులి’ విజయయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం తుముకూరులోని గాయత్రీ థియేటర్‌కు హీరో సుదీప్ వచ్చాడు.
అతడిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఓ హోటల్‌లో పనిచేసే శశిధర్(45)కు కూడా సుదీప్ అంటే చెప్పలేనంత అభిమానం. దీంతో సుదీప్‌ను చూసేందుకు వెళ్లి సందడి చేశాడు. అతడితో కరచాలనం చేసి ఆత్మీయంగా హత్తుకున్నాడు. అభిమాన హీరోను ఆలింగనం చేసుకున్న ఆనందంలో ఇంటికి వెళ్తున్న శశిధర్ మార్గమధ్యంలో గుండెపోటుతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోగానే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తుముకూరులో విషాద ఛాయలు అలముకున్నాయి.