: ఏమిటీ శషబిషలు?.. ఎస్‌బీఐపై నిప్పులు చెరుగుతున్న ప్రజలు.. ఖాతాలు మూసేస్తామంటూ అల్టిమేటం!


‘టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు..’, ‘టైం బాబూ టైం’.. తమవంతు వచ్చినప్పుడు వాడే కొన్ని సామెతలు ఇవి. ఇప్పుడు వీటికి టైమొచ్చింది. ఎడాపెడా బాదుడుకు సిద్ధమైన భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్‌బీఐ) తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సామాన్యులు.. ఇప్పుడు ‘టైం’ మాదంటూ ఎస్‌బీఐని హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లూ తమను ఆటాడుకున్న బ్యాంకులను ఇప్పుడు తాము ఆటాడుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డబ్బులు దాచుకున్నా పన్ను, తీసినా పన్ను, కార్డు వాడినా పన్ను, వాడకున్నా పన్ను అంటే తమ వల్ల కాదని తెగేసి చెబుతున్నారు. ఖాతాల్లో కనీసం రూ.5వేలను తాము ఉంచలేమని, ఖాతాలు మూసేస్తామని హెచ్చరిస్తున్నారు. తమ డబ్బులు తాము తీసుకునేందుకు ఈ ఆంక్షలేమిటో తెలియని ప్రజలు బ్యాంకుల తీరుపై మండిపడుతున్నారు. తమనుంచి పిండి మాల్యా లాంటి వారికి అప్పులు ఇచ్చేందుకే ఇటువంటి నిబంధనలు విధిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు పారిపోతున్న వారిని ఏమీ చేయలేని బ్యాంకులు సామాన్యులపై ప్రతాపం చూపిస్తున్నాయని అంటున్నారు. ఇక సహించడం తమ వల్ల కాదంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమానికి తెరలేపారు. అసలు ఈ గోలంతా ఎందుకు ఖాతాలు క్లోజ్ చేసి ఆ సొమ్మేదే తమ వద్దే భద్రంగా దాచుకుంటామని, అప్పుడు ఈ ట్రాన్సాక్షన్ల గొడవ, ఏటీఎంల గొడవ ఉండదని చెబుతున్నారు. ఎస్‌బీఐ తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుందా సరేసరి. లేకుంటే దేశవ్యాప్తంగా సామాన్యులు తమ ఖాతాలు క్లోజ్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం హోరెత్తుతోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 6ను ‘నో ట్రాన్సాక్షన్ డే’గాను పాటించాలంటూ పిలుపునిచ్చారు.  మరోవైపు ఎస్‌బీఐనే ప్రైవేటు బ్యాంకులు కూడా అనుసరించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో వాటికి ఆ అవకాశం ఇవ్వకుండా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ఎస్‌బీఐకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. బ్యాంకులు దిగొచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని సామాన్యులు హెచ్చరిస్తున్నారు.  మరి ఎస్‌బీఐ తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటుందో.. లేదో వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News