: ఈ రోజు సభలో ఏం జరగబోతోంది?.. వైసీపీలో టెన్షన్.. టెన్షన్
వైసీపీలో ఇప్పుడు టెన్షన్ రాజ్యమేలుతోంది. నేతలందరూ టెన్షన్‌గా గడుపుతున్నారు. కారణం అసెంబ్లీలో రోజా, ఇతర ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలు. ఇప్పుడవే వారి మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారపక్షం వ్యూహం ఏంటో తెలియక వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాదిపాటు వేటు వేస్తారా? మరో ఐదుగురు శాసనసభ్యులపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? వారిపైనా వేటేస్తారా? వంటి ప్రశ్నలు వారిని కుదురుగా ఉండనీయడం లేదు.
అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనిత స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన దానిని సభా హక్కుల సంఘానికి పంపారు. ఇందుకు సంబంధించిన నివేదికను సభాసంఘం సిద్ధం చేసింది. రోజా అంశం కనుక అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తే ఆమెను మరో ఏడాదిపాటు సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు పలుమార్లు బహిరంగంగానే పేర్కొన్నారు. అలాగే వైసీపీకి చెందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రాజా, రామకృష్ణారెడ్డి, ముత్యాలనాయుడు, శ్రీనివాసులు తదితరులను కూడా సభాహక్కుల కమిటీ విచారించింది. ఈ మేరకు సిద్ధం చేసిన నివేదికను స్పీకర్‌కు అందించింది. నేటి సభలో ఆ నివేదికలపై ప్రస్తావన ఉంటుందేమోనన్న గుబులు ఇప్పుడు వైసీపీలో మొదలైంది.