: యూపీ సీఎంకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఎన్నికల సంఘం (ఈసీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు తక్షణమే వివరణ ఇవ్వాలని, రేపు సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో ఆదేశించింది. కాగా, యూపీలో నిన్న నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అఖిలేశ్ యాదవ్, ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ, ఓటు మాత్రం సమాజ్ వాదీ పార్టీకే వేయండని ఓటర్లకు పిలుపు నిచ్చారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం చెబుతూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, మీడియా ప్రతినిధులు తనకు సహకరిస్తే ఎన్నికల అనంతరం వారికి రివార్డులు ఇస్తానని అఖిలేష్ వ్యాఖ్యానించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఈ విషయమై కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అఖిలేశ్ కు ఈసీ షోకాజ్ నోటీసు ఇచ్చింది.