: తమిళనాడులో మద్యం విక్రయాలు... శశికళ కుటుంబం రికార్డు!


అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, శశికళ కుటుంబానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. తమిళనాడు రాష్ట్రంలో శశికళ కుటుంబానికి చెందిన ‘మిడాస్’ అనే మద్యం విక్రయాల సంస్థ రికార్డు సృష్టించింది. గత పద్నాలుగు సంవత్సరాలలో సుమారు రూ.20 వేల కోట్ల మద్యంను విక్రయించినట్టు తాజా సమాచారం.

2001 నుంచి 2006 వరకు కొనసాగిన అన్నాడీఎంకే పాలనలో రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయమై నాడు అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకోవడానికి కొన్ని నెలల ముందు.. ‘మిడాస్ గోల్డెన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట మద్యం పానీయాల ఉత్పత్తిని ప్రారంభించింది. ముగ్గురు పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో స్థాపించిన ఈ సంస్థలో శశికళ బంధువులు రావణన్, శివకుమార్, కార్తికేయన్, కలియ పెరుమాళ్ భాగస్వాములుగా ఉన్నారు.

కాలక్రమంలో.. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న మద్యం చిల్లర దుకాణాలకు ‘మద్యం’ పానీయాలను పూర్తి స్థాయిలో సరఫరా చేసేలా ఈ సంస్థ ఎదిగింది. డీఎంకే అధికారంలో ఉన్న 2007 నుంచి 2011 మధ్య కాలంలో రూ.2,773 కోట్ల విలువ చేసే మిడాస్ సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంస్థ వ్యాపారం ఊపందుకుంది. పలు రకాల కొత్త బ్రాండ్లను సదరు సంస్థ పరిచయం చేసింది. గత పద్నాలుగు సంవత్సరాలలో మిడాస్ సంస్థ రూ.20 వేల కోట్ల మేరకు మద్యం విక్రయాలు జరిపింది.  

  • Loading...

More Telugu News