: తెలుగులో తెలంగాణ శాస‌న‌స‌భ వెబ్‌సైట్ ప్రారంభం


‘తెలంగాణ శాసనసభలో స్థానిక భాషల్లో వెబ్ సైట్ ప్రారంభం’ కార్యక్రమం ఈ రోజు హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ‌ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజ‌రై తెలంగాణ‌ శాస‌న‌స‌భ‌ తెలుగు భాష వెబ్ సైట్‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడిన మూడేళ్లలోపే దేశంలోనే తొలిసారిగా ఈ వెబ్ సైట్ ను ప్రాంతీయ భాషల్లో ప్రారంభించడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. ఇంగ్లిష్ మాత్ర‌మే కాకుండా తెలుగు, ఉర్దూ భాషలతో ఈ వెబ్ సైట్ నిర్వ‌హించ‌డం వ‌ల్ల పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధుల పనితీరును ప్రజలు తెలుసుకునేందుకు స్థానిక భాషల వెబ్ సైట్ ఉపయోగ‌ప‌డుతుంద‌ని అన్నారు.
 
ఈ సంద‌ర్భంగా శాస‌న‌స‌భ‌ ఉర్దూ వెబ్ సైట్ ను మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, సభ్యుల పోర్టల్‌ను మంత్రి హరీశ్‌ రావు, శాఖ పోర్టల్ ను అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌ పద్మాదేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ... శాస‌న‌స‌భ‌లో జరిగే చర్చలపై ప్రజలకు సమాచారం లభిస్తుందని చెప్పారు. ఈ సౌక‌ర్యం దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే క‌ల్పించ‌డం గర్వకారణమని వ్యాఖ్యానించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... సభ్యుల లాగిన్ ద్వారా త‌మ త‌మ‌ నియోజకవర్గాల్లో సమస్యలను ప్రజలు నేరుగా శాస‌న‌స‌భ్యుడి దృష్టికి తీసుకుపోవ‌చ్చ‌ని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి సమాచారాన్ని కూడా వెబ్ సైట్ లో ఉంచ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News