: లక్కీ ఎన్నారై... కోట్లలో లాటరీ కొట్టేశాడు!
దుబాయ్ లో నివసిస్తున్న భారతీయుడికి పెద్ద మొత్తంలో ఓ లాటరీ తగిలింది. కేరళకు చెందిన ముప్ఫై మూడు సంవత్సరాల శ్రీరాజ్ కృష్ణన్ కొప్పరెంబిల్ అనే వ్యక్తి గత తొమ్మిదేళ్లుగా దుబాయ్ లో నివసిస్తున్నాడు. ఓ షిప్పింగ్ కంపెనీలో కో-ఆర్డినేటర్ గా పని చేస్తున్న కృష్ణన్ కు ప్రతి రోజూ ఓ లాటరీ టికెట్టు కొనే అలవాటు ఉంది. ఈ క్రమంలో అబుదాబి బిగ్ లాటరీ టికెట్ (నెంబర్ 44698) ను ఇటీవల కొనుగోలు చేశాడు. నిన్న తీసిన డ్రాలో ఈ నెంబర్ కు లాటరీ తగిలింది. సంబంధింత వ్యక్తుల నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న కృష్ణన్ సంతోషానికి పట్టపగ్గాల్లేవు.
ఏడు మిలియన్ దిర్హామ్ లు.. మన కరెన్సీలో సుమారు రూ.12 కోట్లకు పైమాటే. ఈ సందర్భంగా కృష్ణన్ మాట్లాడుతూ, తనకు నెల జీతం కింద లక్ష రూపాయల వరకు వస్తుందని, అయితే, ఆ డబ్బులో ఎక్కువ శాతం కేరళలో తన సొంత ఇంటి లోన్ నిమిత్తం పంపిస్తుంటానని చెప్పారు. తన భార్య కూడా దుబాయిలోనే ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోందని చెప్పిన కృష్ణన్, లాటరీ ద్వారా పెద్దమొత్తంలో నగదు వచ్చినప్పటికీ, ఆ దేశం నుంచి భారత్ కు ఇప్పుడే రాదలచుకోలేదని చెప్పారు. ఇంత పెద్దమొత్తంలో లాటరీ తగలడం అన్నది తనకు ఓ స్వీట్ షాక్ అనీ, అందులోంచి తాను ఇంకా తేరుకోలేదని, ఆ తర్వాత అన్ని విషయాలు ఆలోచిస్తానని కృష్ణన్ తెలిపారు.