: అదో భారతీయ ఐటీ మాఫియా: అమెరికాలో వీడియో వైరల్
కొన్ని రోజులుగా అమెరికాలోని భారతీయులపై వరుసగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. సేవ్ అమెరికన్ ఐటీ జాబ్స్.కామ్ అనే వెబ్‌సైట్‌ను నడిపిస్తోన్న సదరు వ్యక్తి ఒహాయో రాష్ట్రంలోని కొలంబస్ టౌన్ భారతీయులతో నిండిపోయిందని ఆ వీడియోలో చూపించాడు. ఆ ప్రాంతం ఒక ఇండియన్ పార్క్ అని, మినీ ముంబై అని పేర్కొన్నాడు. తమ దేశ పౌరుల ఉద్యోగాలను దోచుకొని, భారతీయులు ఎలా సంపాదిస్తున్నారో ఈ వీడియో చూస్తే తెలుస్తుందని ఆ వెబ్‌సైట్‌లో అన్నాడు. అదో భారతీయ ఐటీ మాఫియా అని వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఈ వీడియోకు ఇప్పటికే లక్షకు పైగా క్లిక్స్ వచ్చాయి.
ఆ వెబ్‌సైట్‌ను నడిపిస్తోన్న వ్యక్తి పేరు స్టీవ్ పుషర్. ఆయన వర్జీనియా నుంచి దీన్ని నడిపిస్తున్నాడు. గతంలోనే ఈ వీడియోతోపాటు ఒహాయో ఎ జర్నీ టు ఇండియన్ పార్క్ అనే ఓ డాక్యుమెంట్‌ను కూడా ఆయన రూపొందించగా, ఆ వీడియో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత వైరల్ అవుతోంది. తమ దేశీయుల ఉద్యోగాలను భారతీయులు లాక్కుంటున్నారని చెప్పడమే తన ఉద్దేశమని, వీళ్లందరినీ అమెరికా వదిలి వెళ్లాలని కాదని, వారిపై హింసను ప్రోత్సహించాలన్న ఉద్దేశం తనకు లేదని స్టీవ్ పుషర్ చెప్పాడు.