: ప్రస్తుతానికి టీడీపీతో మిత్రులం.. భవిష్యత్తులో వైసీపీతో చెలిమి విషయం మాత్రం నేను చెప్పలేను!: పురందేశ్వరి కీలక వ్యాఖ్య
ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీతో మిత్రబంధం కొనసాగుతుందని, ఆ పార్టీ నుంచి ఎలా ఉన్నప్పటికీ, తాము మాత్రం మిత్ర ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నామని బీజేపీ నేత పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతానికి సాగుతున్న తమ బంధం, భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేనని అనడం గమనార్హం. బీజేపీలో తాను గౌరవంగానే ఉన్నానని, పార్టీ మారే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో తాను వైసీపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను ఆమె కొట్టి పారేశారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై ప్రస్తుతం తానేమీ చెప్పలేనని బీజేపీ నేత పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఆ పార్టీతో స్నేహం అన్నది తాను తీసుకునే నిర్ణయం కాదని, తమ పార్టీ సీనియర్లే తీసుకుంటారని చెప్పిన ఆమె, పరిస్థితులను బేరీజు వేసుకుని వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వైసీపీతో చెలిమిపై నిర్ణయాధికారం తీసుకునేంత స్థాయి తనది కాదని పురందేశ్వరి అన్నారు.