: ఈ ఆట చూడాలా?... పట్టుమని పది శాతం కూడా నిండని చిన్నస్వామి స్టేడియం!
భారత జట్టు క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉందంటే, ప్రపంచంలోని ఏ వేదికపైనైనా అభిమానులు పోటెత్తుతారనడంలో సందేహం లేదు. వన్డేలు, టీ-20 పోటీలయితే స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. టెస్టు మ్యాచ్ లకైనా మంచి ఆదరణే ఉంటుంది. కానీ, ప్రస్తుతం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టును ప్రత్యక్షంగా తిలకించేందుకు మాత్రం అభిమానులు ఏ మాత్రం ఆసక్తిని చూపించడం లేదు. నిన్న కాస్తంత పల్చగానైనా కనిపించిన అభిమానులు, నేడు మరీ పలచనై పోయారు.
స్టేడియంలోని ఆఫ్, ఆన్ సైడ్ స్టాండులైతే పూర్తి ఖాళీగా కనిపిస్తున్నాయి. స్టేడియం పూర్తి సామర్థ్యంతో పోలిస్తే, 10 శాతం కూడా సీట్లు నిండలేదని తెలుస్తోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోవడం, ఆపై రెండో టెస్టులో కూడా ఆస్ట్రేలియా చెప్పుకోతగ్గ ఆధిపత్యాన్ని సాధించడంతోనే అభిమానులు స్టేడియానికి దూరమైనట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, మూడో రోజు ఆటను కొద్దిసేపటి క్రితం ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు నిలకడగా ముందుకు సాగుతోంది. ఈ మ్యాచ్ లో ఇండియా తన తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 107 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ప్రస్తుతం మిచెల్ స్టార్స్ 14, మ్యాథ్యూ వాడే 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.