: బెంగళూరు - ఢిల్లీ విమానంలో మరుగుదొడ్డి కంపు... భరించలేక మధ్యలోనే ల్యాండింగ్
సినిమా హాల్స్, బస్టాండ్లు, రైళ్లలోని టాయిలెట్లు కంపు కొట్టడం సర్వ సాధారణమే. దాన్ని భరించలేక పక్కకు తప్పుకుని దూరంగా వెళ్లిపోతాం. అదే విమానంలోని మరుగుదొడ్డి కంపు కొట్టడం ప్రారంభిస్తే, గాలి బయటకు పోయే వీలుండక, విమానంలోని వారు ఒక్క క్షణం కూడా భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. వేలకు వేలు డబ్బు పోసి టికెట్లు కొనుక్కునే వారు ఈ కంపును భరిస్తూ, కూర్చుంటారా? సమస్యే లేదు... ఈ విమానాన్ని కిందకు దించేయాల్సిందే. స్పైస్ జెట్ విమానంలో ఇదే జరిగింది.
మొత్తం 188 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో టాయిలెట్ నుంచి దుర్వాసన వస్తోంది. దీనిపై విమానం టేకాఫ్ కాగానే ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఇంకాసేపటికి అది భరించలేని స్థితికి చేరుకుని, కాక్ పిట్ లోకి కూడా వెళ్లింది. ప్రయాణికులు, సిబ్బంది, పైలట్లు సైతం ఆ వాసన భరించలేక, విషయాన్ని హైదరాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు చెప్పి, విమానం ల్యాండింగ్ కు అనుమతి తీసుకున్నారు. ఆపై హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దించి, అంతా శుభ్రం చేసి, కొత్త గాలిని విమానంలోకి వదిలి తిరిగి ఢిల్లీకి విమానాన్ని పంపినట్టు స్పైస్ జెట్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.