: సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన అమెరికా ఫస్ట్ లేడీ డ్రెస్!
అమెరికా ఫస్ట్ లేడీని ఫ్యాషన్ ఐకాన్ గా భావిస్తారు ఫ్యాషన్ ప్రియులు. ఆమె ఎలాంటి డ్రెస్ ధరించింది? ఏ ఫ్యాషన్ అనుకరించింది? వంటి ప్రతి విషయాన్ని అమెరికన్లు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అమెరికన్ల ఆశలకు అనుగుణంగా యూఎస్ అధ్యక్షుడి భార్య కూడా వినూత్న ఫ్యాషన్స్ ను అనుకరిస్తుండడం పరిపాటిగా వస్తోంది. దీనిని ప్రస్తుత ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ఉల్లంఘించారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియా ముందుకు పెద్దగా రాని మెలానియా, తాజాగా రెండు రోజుల పాటు ఒకే డ్రెస్సుతో వేర్వేరు కార్యక్రమాలకు హాజరై వైట్ హౌస్ ఫ్యాషన్ నిబంధనలను బ్రేక్ చేశారు.
మంగళవారం డొనాల్డ్ ట్రంప్ తో కలిసి ఓవల్ ఆఫీస్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మెలానియా ఎరుపు రంగు వ్యాలెంటినో డ్రెస్ ధరించి హాజరయ్యారు. తరువాత అదే రోజు మరో కార్యక్రమానికి వేరే డ్రెస్ ధరించి హాజరయ్యారు. అయితే మరుసటి రోజు వాషింగ్టన్ డీసీలోని పిల్లల ఆస్పత్రిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముందు రోజు ధరించిన వ్యాలెంటినో డ్రెస్ నే ధరించి హాజరయ్యారు. దీంతో ఆమె డ్రెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అమెరికా ఫస్ట్ లేడీ అయివుండీ ఒకే డ్రెస్ ని వరసగా రెండో రోజూ వేసుకోవడమేంటని కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.