: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి అస్వస్థతకు గురి కావడంతో ఆయనను నిన్న రాత్రి బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే ఆయన మైసూర్, ఛిత్రదుర్గ జిల్లాల్లో పర్యటించారని, ఆయనకు జ్వరంతో పాటు గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన వారం రోజుల్లో కోలుకుంటారని వారు అంటున్నారు. ఆసుపత్రిలో కుమారస్వామికి యాంటీ బయాటిక్స్ ఇస్తున్నట్లు విక్రమ్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ తోనే ఆయన బాధపడుతున్నారని అన్నారు. మరో మూడు రోజుల్లో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. మరోపక్క, కొన్ని రోజుల పాటు తాను ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనబోనని కుమారస్వామి తెలిపారు.