: భద్రతపరమైన అంశాలను ప్రతిపక్షాలు ఎందుకు రాజకీయం చేస్తున్నాయి?: ప్రధాని మోదీ ఆగ్రహం
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో ఈ రోజు ర్యాలీలో పాల్గొన్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్జికల్ స్ట్రయిక్స్ లాంటి జాతీయ భద్రతపరమైన అంశాలను ఎందుకు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ప్రశ్నించారు. దేశ భద్రత కోసం తీసుకొనే నిర్ణయాలపై అలా ఎందుకు? ఎలా? ప్రశ్నించగలుగుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ఆ అంశాన్ని రాజకీయం చేస్తోన్న వారు జాన్‌పూర్ వెళ్లి అమర జవానుల కుటుంబాలను ఆ అంశంపై అడగాలని, జవాన్లు ఎందుకు సర్జికల్ దాడులు చేయాల్సి వచ్చిందో తెలుస్తుందని ఆయన హితవు పలికారు.
ఉత్తరప్రదేశ్‌లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలోనే రాష్ట్రంలోని సన్నకారు రైతులకు రుణాలనిచ్చే విధానాన్ని సరళీకృతం చేస్తామని మోదీ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు చేస్తూ.. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్ 40 ఏళ్లుగా ఉందని అన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పారు. తాము పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆ అంశంపై హామీ ఇచ్చామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే ఇచ్చేశామని చెప్పారు.