: వయసు పెరిగేకొద్దీ పెరుగుతున్న శని కళ
గ్రహాలు చాలా వరకూ ఏళ్లు గడిచేకొద్దీ చల్లబడుతుంటాయి. కొద్దిగా నల్లబడుతుంటాయికూడా. అయితే ఏళ్ళు గడుస్తున్నా శనిగ్రహం మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా మరింత తేజస్సుతో కళకళలాడుతోంది. దీనికి కారణం ఏంటా అని శాస్త్రవేత్తలు బుర్ర బద్దలు కొట్టుకుంటూ వచ్చారు. ఇలా వయసు పెరిగేకొద్దీ కళ పెరగడానికి కారణం ఏంటనేది శాస్త్రవేత్తలకు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. దీనిపై ఎన్నో ఏళ్ళుగా చేస్తున్న పరిశోధనల ఫలితంగా అసలు శనిగ్రహంలోని ఆ తేజస్సుకు అంతర్గత వాయువులే కారణమని చివరికి శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
శనిగ్రహంలో అంతర్గతంగా ఉత్పన్నం అయ్యే వాయువు పొరలు గ్రహంలోని వేడిని బయటికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నాయి. దీనికారణంగా ఆ గ్రహం చల్లబడకుండా వెలుగులీనుతోందని ఎక్స్‌టెర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ప్రొఫెసర్ గిల్లెస్ ఛాబ్రియెర్ తెలిపారు. శనిగ్రహం ఇలా ఏళ్ళు గడుస్తున్నా వెలుగులీనడానికి ఏదైనా బయటి వనరులను ఉపయోగించుకుంటోందా అన్న దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. కానీ అంతర్గతంగా ఉత్పన్నం అయ్యే వాయువే ఆ గ్రహం తేజస్సుకు కారణమనే విషయాన్ని తెలుసుకున్నట్లు ప్రొఫెసర్ గిల్లెస్ పేర్కొన్నారు. శనిగ్రహం లాగా మనిషికి కూడా ఏళ్లు గడుస్తున్నా తేజస్సు తగ్గకుండా ఉండేలా ఏదైనా ఉంటే బాగుంటుంది అని మనకనిపిస్తుంది కదా...!