: సీఎం తల నరికితే రూ. కోటి ఇస్తానన్న చంద్రావత్‌ను తొలగించిన ఆరెస్సెస్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తలకు కోటి రూపాయల వెలకట్టి సంచలనం సృష్టించిన ఆరెస్సెస్ నేత డాక్టర్ కుందన్ చంద్రావత్‌ను ఆరెస్సెస్ తొలగించింది. ఉజ్జయిన్ మహానగర్ షా ప్రచార్ ప్రముఖ్ విధుల నుంచి ఆయనను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విధుల నుంచి తనను తప్పించినా తాను మాత్రం ఆరెస్సెస్‌లోనే కొనసాగుతానని చంద్రావత్ స్పష్టం చేశారు. చంద్రావత్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసినట్టు ఆరెస్సెస్ ప్రంత్ సంఘ్ చాలక్ డాక్టర్ ప్రకాశ్ శాస్త్రి తెలిపారు. ఆయన వ్యాఖ్యలను ఆరెస్సెస్ వ్యాఖ్యలుగా పరిగణించవద్దని ఆరెస్సెస్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో చంద్రావత్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. కేరళలో ఆరెస్సెస్ కార్యకర్తల హత్య తనను తీవ్రంగా బాధించిందని, ఆ ఆవేదనలోనే అలా మాట్లాడినట్టు పేర్కొన్నారు. ఇప్పడా ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు.