: పెట్టుబడుల కోసం ప్రపంచాన్ని చుట్టేద్దాం.. దూకుడు పెంచిన ఏపీ ప్రభుత్వం


పెట్టుబడుల కోసం ప్రపంచాన్ని చుట్టేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు 12 దేశాల్లో 20 రోడ్‌ షోలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. అమెరికా నుంచి తైవాన్ వరకు ‘వేట’ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరగనున్న 14 విశ్వ పెట్టుబడుల సదస్సుల్లో పాల్గొనాలని ఆర్థికాభివృద్ధి మండలి చేసిన కీలక ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు.

అంతేకాదు, ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రతిపాదించిన ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ) కే ఇందుకు సంబంధించిన నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించారు. రోడ్ షోల కోసం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమెరికా, యూరప్‌లలో మూడేసి, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లో ఒకటి, ఇంగ్లండ్, కెనడాలలో ఒక్కోటి చొప్పున రోడ్ షో నిర్వహిస్తారు. అలాగే చైనా, రష్యాల్లో రెండు, జపాన్, తైవాన్‌లలో ఒక్కోటి చొప్పున రోడ్ షోలు నిర్వహిస్తారు. పారిశ్రామిక సదస్సులు, రోడ్‌ షోలలో రాష్ట్రంలోని ఖనిజ సంపద, మానవ వనరులు, సుదీర్ఘ తీర ప్రాంతం గురించి సమగ్రంగా వివరించాలని చంద్రబాబు సూచించారు. అలాగే రంగాల వారీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు.
 
 

  • Loading...

More Telugu News