: పరుగున వెళ్లి... ఛాయ్ వాలాను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ధోనీ!


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సాధారణ జీవితానికి అలవాటుపడ్డాడు. నిన్న మొన్నటి వరకు భారత జట్టు కెప్టెన్ గా ఉన్న ధోనీని కలవాలంటే ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. ధోనీ కెప్టెన్ గా వ్యవహరించిన పూణే జట్టు ఎండీ చేసిన ఆరోపణలు కూడా అలాంటివే కావడంతో ధోనీని కలవడం ఎంత అసాధ్యమో అర్ధమైంది. అయితే ధోనీ ఎవరినీ మర్చిపోలేదని తెలిపే సంఘటన విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా చోటు చేసుకుంది.

ధోనీ టీమిండియాలోకి రాకముందు..జూనియర్ టీటీగా పని చేసే రోజుల్లో ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ, క్రికెటర్ గా నిలదొక్కుకునేందుకు ధోనీ తీవ్రంగా ప్రయత్నం చేసేవాడు. ఆ రోజుల్లో ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ బయట థామస్ అనే వ్యక్తి టీ కొట్టు నడుపుకునేవాడు. రైల్వే స్టేషన్ లో దొరికే టీ కంటే థామస్ దగ్గర టీ తాగేందుకు ధోనీ మొగ్గు చూపేవాడు. దీంతో రోజులో కనీసం మూడు సార్లు ధోనీ థామస్ చేతితో తయారయ్యే టీని రుచి చూసేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన పరిచయం స్నేహంగా మారింది.

తరువాత కాలం చక్రంలా గిర్రున తిరిగింది. ధోనీ కెప్టెన్ అయ్యాడు. దీంతో థామస్, ధోనీ మధ్య బంధానికి బ్రేక్ పడింది. అయితే తాజాగా విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా ధోనీ మరోసారి కోల్ కతాకు సాధారణ రంజీ ఆటగాడిగా వెళ్లాడు. ఈ విషయం తెలిసిన థామస్, ధోనీని కలుసుకునేందుకు కోల్ కతా వెళ్లాడు. అతి కష్టం మీద ఈడెన్ గార్డెన్ మైదానంలో రంజీ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూంను చేరుకున్నాడు.

ఈ క్రమంలో థామస్ ను ధోనీ చూశాడు. అంతే... పరుగు వెళ్లి థామస్ ను ఆలింగనం చేసుకున్నాడు. ఎలా ఉన్నావు? అంటూ కుశల ప్రశ్నలు అడిగాడు. థామస్ చాయ్ గురించి అందరికీ చెప్పి పరిచయం చేశాడు. తరువాత థామస్ ను డిన్నర్ కు తీసుకెళ్లాడు. డిన్నర్ ముగిసిన తరువాత స్వయంగా వెళ్లి అతనిని ఇంటివద్ద దింపి వెనుదిరిగాడు. దీంతో థామస్ మురిసిపోయాడు. తన టీ స్టాల్ కు ధోనీ టీ స్టాల్ అని పేరు పెట్టుకుంటానని తెలిపాడు. 

  • Loading...

More Telugu News