: చంద్రబాబు వినూత్న ఆలోచన... 'అమరావతి' పేరిట ప్రభుత్వ ఎయిర్ లైన్స్
శరవేగంగా విస్తరిస్తున్న నవ్యాంధ్ర నూతన రాజధాని అవసరాలను తీర్చేలా, విమాన ప్రయాణికుల రాకపోకలను పెంచేలా ఏపీ ప్రభుత్వం 'అమరావతి' పేరిట ఓ ఎయిర్ లైన్స్ సంస్థను ప్రారంభించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విషయాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారని ప్రభుత్వ అధికారి ఒకరు భారత అధికార వార్తా సంస్థ పీటీఐకి వివరించారు. రాష్ట్రంలో విమానయాన రంగానికి ఉద్దీపన ఇవ్వడంతో పాటు, గ్లోబల్ కనెక్టివిటీ లక్ష్యంగా ఈ సంస్థ ఏర్పాటు కానుందని తెలిపారు. "అమరావతి అభివృద్ధి చెందుతున్న వేళ, ప్రభుత్వం ఈ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఎయిర్ లైన్ సంస్థను సమయానుకూల అవసరాలను బట్టి ప్రారంభించే యోచనలో ఉంది" అని ఆయన తెలిపారు.
కాగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఐదు వాణిజ్య విమానాశ్రయాలున్నాయి. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, కడపల్లో విమానాశ్రయాలుండగా, మరో ఆరు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు, కుప్పం, తాడేపల్లిగూడెం, ఒంగోలు ప్రాంతాల్లో పీపీపీ (పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్ నర్ షిప్) విధానంలో అభివృద్ధి దశలో ఉన్నాయి. రాష్ట్రానికి విమానాల రాకపోకలు పెంచాలన్న ఉద్దేశంతో ఏపీ సర్కారు ఇప్పటికే జెట్ ఫ్యూయల్ పై నాలుగు శాతంగా ఉన్న విలువ ఆధారిత పన్నును ఒక శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. అధికారిక అంచనాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో 27 లక్షలుగా ఉన్న ఏపీ విమాన ప్రయాణికుల సంఖ్య ఈ సంవత్సరంలో 36 లక్షలకు చేరవచ్చు.